ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన ఒక పోస్ట్‌పై నటుడు బ్రహ్మాజీ స్పందించిన విషయం తెలిసిందే.
కానీ, ఈ పోస్ట్‌ను తాను చేయలేదని బ్రహ్మాజీ తాజాగా ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించారు. తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని, ఆ ట్వీట్ తనకు సంబంధం లేదని చెప్పారు. “నా ఎక్స్ (ట్విటర్) ఖాతా ఎవరో హ్యాక్ చేశారు. ఆ ట్వీట్ నా కాదు. ఫిర్యాదు చేశాం” అని బ్రహ్మాజీ పేర్కొన్నారు. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇప్పుడు ఏమి జరిగిందంటే…
వరదలు వచ్చి ఎనిమిది రోజులు గడుస్తున్నా బాధితులకు సాయం అందడం లేదని ఆరోపిస్తూ జగన్ ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. “క్షేత్రస్థాయిలో జరుగుతున్న సాయం మీకు కనపడడం లేదు?” అంటూ వారు ప్రశ్నించారు. “ఐదేళ్ల పాటు మీరు చేసిన తప్పుల వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది,” “ఇది రాజకీయ ఆట కాదు, ఇది ప్రజల జీవితం,” “సోషల్‌మీడియాలో విమర్శలు ఆపి ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం చేయండి” అని మండిపడ్డారు.
జగన్ పోస్ట్‌పై బ్రహ్మాజీ తనదైన శైలిలో స్పందించారు. “మీరు కరెక్ట్ సార్. వాళ్ళు చేయలేరు. మనం రూ.1000 కోట్లు విడుదల చేద్దాం, వైకాపా కేడర్ మొత్తం రంగంలోకి దింపుదాం. మనం చేసి చూపిద్దాం సార్. జై జగన్ అన్నా” అంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు, వరద ప్రాంతాల్లో సహాయచర్యలు కొనసాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. శనివారం అందరికీ ఆహారం, మంచినీరు అందించినట్లు చెప్పారు. బాధితులకు ఇంటింటికీ సరకుల కిట్ పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారు డిమాండ్ చేసి సాయం పొందవచ్చని చెప్పారు. 64 టన్నుల కూరగాయలు రాయితీ ధరపై విక్రయించినట్లు, 78% రోడ్లు శుభ్రపరిచినట్లు, 1.40 లక్షల ఇళ్లలో సామగ్రి పాడైందని వెల్లడించారు. ఉపాధి కల్పించడానికి కొన్ని కంపెనీలతో మాట్లాడి అవకాశాలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.