రాజకీయాల్లో శత్రువులు ఉంటారు … మిత్రులు ఉంటారు ..
అలాగే రాజకీయాల్లో పరిస్థితులు రోజు రోజుకి మారుతూ ఉంటాయి …
అయితే ఇలాంటి పాలిటిక్స్ లో పరిణామాలు వేగవంతంగా మారుతున్నాయి.. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో తేడా చాలా స్పష్టంగా కనిపించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై విజయం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి రాగా… 2024 లోక్ సభ ఎన్నికల్లో అదే కాంగ్రెస్ 9 లోక్ సభ స్థానాల్లో ఓటమి చూసింది. ఇక బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు. కానీ అసెంబ్లీలో మాత్రం 39 స్థానాలను గెలిచింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌లో అంతా బాగుంది అని చెప్పడానికి కూడా లేదు. కేంద్రంలో బీజేపీ స్వతహాగా మ్యాజిక్ ఫిగర్ దక్కించుకోవడంలో విఫలమైన నేపథ్యంలో కొత్త మార్గాలకోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది. హిందూత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ తెలంగాణలో మాత్రం సెక్యులర్ లేదా లౌకికవాద పార్టీగా రీబ్రాండ్ అయ్యేందుకు పావులు కదుపుతోందని వన్ఇండియాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి సెక్యులర్ వాదన వినిపించే నాయకుడికే ఇవ్వాలని హై కమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే అమలైతే ఇక తెలంగాణ బీజేపీలో హిందూత్వ గొంతుక మూగబోయినట్లేనని భావించాల్సి ఉంటుంది. అధికారంలోకి వస్తే హైదరాబాదు పేరును మారుస్తామని చెప్పడం, హిందూ వాదాన్ని బలంగా వినిపించడం అదే అజెండాతో ఇప్పటి వరకు పనిచేసిన బీజేపీ.. తెలంగాణలో తన స్టాండ్ ను మార్చుకోనున్నట్లు సమాచారం. ఇందుకు అనేక కారణాలున్నాయి అందులో ఒక ముఖ్య కారణం బీఆర్ఎస్తో బీజేపీ చర్చలు నెరుపుతుండటమే అని తెలుస్తోంది. 2014 నుంచి 2024 వరకు పరిశీలిస్తే తొలిసారిగా మైనార్టీల ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లింది. దాదాపుగా 10 ఏళ్ల వరకు మైనార్టీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ వైపు నిలిచింది.తెలంగాణలో కనీసం అంటే ఓ 45 నియోజకవర్గాల్లో మైనార్టీలు ఫలితాలను ప్రభావం చేయగల సత్తా ఉందనేది నగ్న సత్యం. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ తో దోస్తీకి బీజేపీ సిద్ధమైందా లేక తెలంగాణలో హిందూత్వ రాజకీయాలు నడవవని బోధపడిందా అనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇందుకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. అయితే రెండు పార్టీలు తీసుకునే నిర్ణయాలు ఆయా పరిస్థితులపై నెగిటివ్‌గా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్నారు. పుండుపై కారం చల్లినట్టుగా.. అసలే కవిత జైలులో మగ్గుతుంటే ఈ మధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఆ పార్టీని మరింత కష్టాల ఊబిలోకి నెట్టేసినట్లయ్యింది. అయితే తిరిగి పూర్వవైభవం సంపాదించాలంటే బీజేపీతో చేతులు కలపడమే గులాబీ పార్టీ ముందున్న ఆప్షన్‌గా కనిపిస్తోంది.పైగా ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ ల ఉమ్మడి శతృవు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అనేది గమనించాల్సిన విషయం.. తెలంగాణలో కాషాయం పార్టీ ఎదగాలంటే సైద్దాంతిక మార్పులు తప్పవని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఓటు బ్యాంకును ఎట్టి పరిస్థితుల్లో విస్మరించరాదనే సత్యాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. కాషాయం గులాబీ పార్టీలు కలిసొస్తే ప్రజలు ఆదరిస్తారా అనేది ఇప్పుడు తెలంగాణలో చర్చ జరుగుతోంది. కలిసి వస్తే ఓడిపోయే అవకాశాలు కూడా లేకపోలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
బీజేపీకి ఉన్న హిందూత్వ ఇమేజ్ బీఆర్ఎస్కు శాపంగా మారే అవకాశాలున్నాయి. మరోవైపు తెలంగాణలో బీజేపీ మనుగడే కష్టంగా మారే పరిస్థితులు రావొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీకి అండగా ఉన్న హిందూ ఓటు బ్యాంకు కోల్పోయే ప్రమాదం రావొచ్చు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్య ఎక్కువ సమయం ఢిల్లీలోనే గడుపుతున్నారు. మరో సీనియర్ నేత మాజీమంత్రి హరీష్ రావు తో కలిసి ఢిల్లీ కేంద్రంగా రాజకీయం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. తన సోదరి కవితకు ఈ కష్ట సమయంలో అండగా ఉంటున్నారని అదే సమయంలో న్యాయపరమైన ప్రక్రియలో కేటీఆర్ కవిత తరుపున పోరాడుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఈ పేరుతో మరో రాజకీయం కూడా నడిచిందనే వార్తలు వస్తున్నాయి. రాజ్యసభలో బీఆర్ఎస్-బీజేపీలో విలీనం చేయడంలో గులాబీ పెద్దలు బిజీగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బీఆర్ఎస్ తిరిగి తెలంగాణలో నిలబడాలన్నా… బీజేపీ కాంగ్రెస్ ను గద్దెదించాలన్నా సింగిల్ హ్యాండెడ్ గా అయితే అది సాధ్యపడదనే విషయం రెండు పార్టీలకు బోధపడింది. అందుకే రెండు పార్టీలు కలిసి తెలంగాణలో రాజకీయం చేస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే సైద్ధాంతిక మార్పులు తప్పవని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమనేది ఎవరో ఒకరు బయటపెడితే గానీ తెలియదు. మరోవైపు నిప్పులేనిదే పొగరాదుగా కదా అని కొంతమంది అంటున్నారు.