Andhra Pradesh latest news : ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా?
లేదా? అనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నిర్ణయం తీసుకోనున్నారు. మంగళవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. టీడీపీ పోటీ చేయాలని నిర్ణయించుకుంటే పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తిని ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపనున్నారు.
పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా తొలుత ముగ్గురు, నలుగురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద్ తదితరుల పేర్లు వినిపించాయి. ఇప్పుడు దిలీప్ చక్రవర్తి అభ్యర్థిత్వానికి పార్టీ మొగ్గు చూపుతోంది.
విశాఖ జిల్లా నేతలు కూడా ఆయన పేరును నివేదిక రూపంలో చంద్రబాబుకు పంపించారు. టీడీపీ పోటీ చేయనుండడంతో ఆయనే అభ్యర్థి. ఇటీవలి ఎన్నికల్లో దిలీప్ టీడీపీ నుంచి అనకాపల్లి లోక్‌సభ టికెట్ ఆశించారు. అయితే భాజపాతో పొత్తులో భాగంగా అనకాపల్లి టికెట్‌ను ఆ పార్టీకి కేటాయించాల్సి రావడంతో దిలీప్ చక్రవర్తికి అవకాశం దక్కలేదు.