తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా పిరాయింపుల ఎపిసోడ్ అయితే పెద్ద చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే మొన్నటి వరకు అధికారపార్టీ కాంగ్రెస్ అసెంబ్లీ సమావేశాలే టార్గెట్ గా.. బీఆర్ఎస్ ఎల్పి విలీనమంటూ ప్రచారం చేసింది. కానీ అసెంబ్లీ సమావేశాల నాటికి తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ప్రస్తుతానికి 10 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్న అధికార పక్షం… ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. అయితే ఫిరాయింపుల చట్టం ప్రకారం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందిగా బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది… అధికార కాంగ్రెస్ పార్టీ విపక్ష బీఆర్ఎస్ పార్టీని బలహీన పర్చేందుకు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మరింత మందిని చేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలలో ఉండగా పార్టీ మారిన 10 మంది మీద అనర్హత వేటు వేయాలని ఇటు స్పీకర్, అటు కోర్టులను బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది..
అసెంబ్లీ వర్షా కాల సమావేశాల్లో ఫిరాయింపుదారులపై అనర్హత వేటు కోసం పట్టుబట్టాలని నిర్ణయించింది. మరోవైపు క్యాడర్ ను కాపాడుకోవాలంటే ఇప్పటినుంచే ఎన్నికల వాతావరణం ఏర్పడేలా చేయాలని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉన్నచోట్ల ప్రత్యామ్నాయ నేతలను ఎంపిక చేసి… ఇప్పటి నుంచి ఉప ఎన్నికలు జరుగుతాయన్నట్లే పనిచేయాలని సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం నేపథ్యం ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు రంగంలోకి దిగారు. ఇప్పటికే పార్టీ మారిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానంలో ప్రత్యామ్నాయ నేతలపై ఫోకస్ పెట్టారు. ఆ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతలు కొలను బాల్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డితోపాటు మెట్టు కుమార్‌యాదవ్ ఇన్ చార్జి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి ఇన్చార్జిగా ఎంపిక చేసి ఉప ఎన్నికలకు సిద్ధం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అదే విధంగా మిగిలిన 9 నియోజకవర్గాలపైనా గులాబీ పార్టీ ఫోకస్ చేసింది ఒకవైపు ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకుంటూనే… పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని పట్టుబడుతున్న బీఆర్ఎస్… కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను సిద్ధంగా ఉండాలని సూచిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.
ఈ మేరకు ఆయా నియోజకవర్గాలలో పార్టీ క్యాడర్ కు మనోస్థైర్యం కల్పించేందుకు కేటీఆర్, హరీష్ రావులు ఒక విడత పర్యటించి సమావేశాలు నిర్వహించారు… కడియం శ్రీహరి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు. పటాన్ చెరులో మహిపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో కొలను బాల్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డిలు ఇంఛార్జ్ పదవులు ఆశిస్తున్నారు. జగిత్యాలలో పార్టీ సీనియర్ నేత ఓరుగంటి రమణారావు, గద్వాలలో మాజీ శాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, ఖైరతాబాద్ లో దాసోజు శ్రవణ్, మన్నె గోవర్దన్ రెడ్డిలు ఇంఛార్జ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో బాన్స్ వాడ, చేవెళ్ల, భద్రాచలం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలలో పలువురు ఆశావాహులు పార్టీ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. మరి అనర్హత వేటు ఖాయమేనా ? ఉప ఎన్నికలు వస్తాయా ? అన్నది వేచిచూడాలి.