ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్-1 మెయిన్ కు 1:100 పద్ధతిలో అభ్యర్థులను పిలవాలనే డిమాండ్లతో రాష్ట్ర సచివాలయం ముట్టడిని జయప్రదం చేయాలని నిరుద్యోగులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. న్యాయమైన డిమాండ్లు నెరవేరేదాకా ఆందోళనలను కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. నిరసనలను ఉధృతం చేస్తున్న నిరుద్యోగులను కట్టడి చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సెక్రటేరియట్ ముట్టడిని భగ్నం చేసేందుకు నిరుద్యోగులను ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టులు చేశారు. చాలాచోట్ల విద్యార్థి నేతలను నిర్బంధంలోకి తీసుకున్నారు.
అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులను, నిరుద్యోగులను వెతికిమరీ పట్టుకుని ఠాణాల్లో వేశారు. అశోక్‌నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లోని అన్ని బుక్‌స్టోర్స్, టీ స్టాళ్లను మూసివేయించారు. అశోక్‌నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లో అనధికారికంగా 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. ప్రతి గల్లీలో పహారా కాస్తున్నారు. సెంట్రల్ ల్రైబ్రరీ వద్ద గస్తీ తిరుగుతున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లకుండా పికెట్లు ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ కు వచ్చే దారుల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలో భారీగా పోస్టులతో కొత్తగా మరో డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.నిరుద్యోగులు జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్న ప్రస్తుత డీఎస్సీ పరీక్షలకి బాగా సిద్ధమై పరీక్షలు రాయాలని సూచించారు. ప్రస్తుతం 11,062 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుందని, ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరో నోటిఫికేషన్ జారీచేస్తామని ఆయన స్పష్టం చేశారు.మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్న పరీక్షలు ఇప్పటి వరకు 2.05 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరికి ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కారానికి 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు.
పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై లోతుగా అధ్యయనం చేయగా ప్రస్తుత నోటిఫికేషన్ పూర్తైనా.. మరో ఐదు వేల ఖాళీలు ఉంటాయని తేలింది. ఈ ఐదువేలతోపాటు భవిష్యత్తులో ఏర్పడే మరికొన్ని ఖాళీలను కలిపి మరో డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.