ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలన లో కీలక పరిణమాలు చోటుచేసుకుంటున్నాయి…సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో హామీల అమలుతోపాటు.. అభివృద్ధిపై ప్రణాళిక సిద్దమవుతోంది.. నేపథ్యంలో జిల్లాల విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత వైసీపీ సర్కార్ పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు జిల్లాలను విభజించాలని నిర్ణయం తీసుకుంది…నిపుణుల కమిటీ సిఫారసులు, సుదీర్ఘ కసరత్తు అనంతరం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా విభజిస్తూ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది..కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో అనేక చోట్ల ఆందోళనలు మిన్ను ముట్టాయి.
ఆనాటి పరిస్థితులు తాజాగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. 2022 ఏప్రిల్ 4న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కొత్త జిల్లాల నుంచి పరిపాలన ప్రారంభమైనా, జిల్లాల పునర్విభజనతో పాటు జిల్లాలకు పెట్టిన పేర్లు కూడా ఉద్రిక్తతలకు దారి తీశాయి.తాజాగా మళ్ళీ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో జిల్లాల విభజన నాటి తేనే తుట్టెను కదిపినట్టు అయ్యింది. అప్పట్లో హిందూపురానికి బదులు పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేయడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ జగన్ సర్కార్ వాటిని పట్టించుకోకుండా తాను అనుకున్న విధంగానే ముందుకు వెళ్లగా , తర్వాత ఎన్నికలు , ఇతర కారణాలతో గొడవ సద్దుమణిగింది. ఇలాంటి పరిస్ధితుల్లో తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో జిల్లాల విభజన గొడవకు మళ్ళీ ఆజ్యం పోసినట్టు అయ్యింది.
సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని చేయాలనే డిమాండ్ ఉందని బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్క హిందూపురంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని చాలా చోట్ల ఇలాంటి డిమాండ్లు చాలానే ఉన్నాయని బాలయ్య తెలిపారు. జిల్లాల పేర్లు అలాగే ఉంచి, జిల్లా కేంద్రాలను మార్చే దిశగా ఆలోచన చేస్తామని బాలయ్య చెప్పటం మళ్ళీ చంద్రబాబుకు తలనొప్పి తెచ్చి పెట్టటమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం బాలయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ మాటలతో పాత డిమాండ్లు తెరపైకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వాన్నిఇబ్బందుల్లో పెట్టే అవకాశాలు లేకపోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి, నిరాశ నిస్పృహలతో ఉన్న వైసీపీ ఇప్పుడు జిల్లాల పునర్విభజన నాటి సమస్యల్ని నిద్రలేపి మళ్లీ యాక్టీవ్ అయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి చంద్రబాబు ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.