Home » BJP Third Cabinet : బీజేపీ మూడో కాబినెట్ లో తెలుగు మంత్రులు వీళ్ళే..?

BJP Third Cabinet : బీజేపీ మూడో కాబినెట్ లో తెలుగు మంత్రులు వీళ్ళే..?

by PoliticalNewsDesk
0 comment

కేంద్రంలో మళ్లీ నరేంద్రమోడి ప్రభుత్వం ఏర్పడితే తెలుగు రాష్ట్రాల్లో బిజెపి నేతల పంట పండినట్లే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న బిజెపి తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం ఐదారుగురికి అవకాశం కల్పించనుంది. ఈ మేరకు ఇప్పటికే కొంత మంది నాయకులకు సంకేతాలు కూడా అందాయి. శక్తి వంచన లేకుండా కష్ట పడి గెలవండి, మీ కోసం కేబినెట్ బెర్త్ ఎదురు చూస్తుంది అని బిజెపి అగ్రనాయకత్వం పార్లమెంటు ఎన్నికల సందర్భంగానే కొంత మంది నేతలకు స్పష్టం చేసింది. కేంద్ర మంత్రులను చేద్దామనుకున్న వారికి ఎన్నికల్లో భారీగా సహాయం కూడా అందినట్లు తెలిసింది. దీంతో కాబోయే కేంద్ర మంత్రులు ఎవరు అనే దానిపై కేడర్ కూ స్పష్టత వచ్చింది.

బిజెపి ఆశిస్తున్నట్లు కేంద్రంలో ఆ పార్టీ మూడోసారి అధికారంలోకి రాగలిగితే తెలుగు రాష్ట్రాల పంట పండినట్లే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈసారి బిజెపి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో 8 నుంచి 10, ఆంధ్రప్రదేశ్ లో రెండు నుంచి నాలుగు స్థానాలు గెలుచుకుంటామని బిజెపి అంచనా వేస్తున్నది. ఇదే జరిగితే ఈ రెండు రాష్ట్రాల నుంచి  ఖచ్చితంగా పది మందికి పైగా బిజెపి ఎంపిలుంటారు. కర్ణాటక మినహా మరే దక్షిణాది రాష్ట్రం నుంచి కూడా ఇంత మంది ఎంపిలు బిజెపికి ఉండే అవకాశం లేదు. దీంతో వచ్చే కేబినెట్లో ఈ రెండు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఎంపిలకు కేంద్ర మంత్రులయ్యే ఛాన్సు వస్తుంది. అదీ కాక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ బావుటా ఎగరేసి తెలంగాణలో అధికారంలోకి రావాలని బిజెపి తహతహలాడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు తర్వాత బిజెపియే అధికార పగ్గాలు చేపట్టడానికి స్కెచ్ వేస్తున్నది. ఈ రెండు రాష్ట్రాల్లో సామాజిక సమీకరణాలను కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలని బిజెపి ప్రయత్నిస్తున్నది. ఈ కోణం నుంచి చూసినా ఈ సారి ఈ రెండు రాష్ట్రాల నుంచి ఎక్కువ మందికి అవకాశం వస్తుందంటున్నారు.

తెలంగాణ నుంచి నలుగురికి తగ్గకుండా కేబినెట్ మంత్రులుంటారని చెబుతున్నారు. వీరిలో కనీసం ఇద్దరు బిసిలు, ఒక రెడ్డి, ఒక మహిళ, ఒక ఎస్సీకి అవకాశం రావచ్చని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క కిషన్ రెడ్డి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గెలిస్తే మంత్రిగా మరోసారి అవకాశం రావచ్చంటున్నారు. అయితే బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా కూడా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. వివాద రహితుడిగా పేరున్న కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగానే మరికొంతకాలం కొనసాగించి, మరొక రెడ్డికి కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పించే ఛాన్స్ కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే రెడ్డి సామాజిక వర్గం నుంచి డికె అరుణ పేరు కేంద్ర మంత్రి పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. అరుణకు మంత్రి పదవి ఇస్తే, అటు రెడ్డికి, ఇటు మహిళకు అవకాశం కల్పించినట్లు అవుతుందని బిజెపి ఆలోచనగా చెబుతున్నారు. బిసి కోటా నుంచి కనీసం ఇద్దరికి అవకాశం కల్పించవచ్చు అంటున్నారు. తెలంగాణలో బిజెపిని బిసిల అనుకూల పార్టీగా మార్చాలని అధిష్టానం ఇప్పటికే నిర్ణయించింది. కాబట్టి కేంద్ర కేబినెట్లో తెలంగాణ బిసిలు ఎక్కువ మందికి అవకాశం వస్తుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బిజెపి, అందుకు అనుగుణంగా ఐదుగురు బిసిలకు ఎంపి టికెట్లిచ్చింది. ఒక బిసిని రాజ్యసభ సభ్యుడిని చేసింది. తెలంగాణలో ముదిరాజు, మున్నూరు కాపు, గౌడ సామాజిక వర్గాల నుంచి బిజెపి ఎంపి అభ్యర్థులున్నారు. ముదిరాజు సామాజిక వర్గం నుంచి సీనియర్ నాయకుడు ఈటల రాజెందర్ రాజెందర్ కు కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమని బిజెపి నాయకులు చెబుతున్నారు. రాష్ట్ర మంత్రిగా, ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజెందర్ అనుభవనాన్ని దృష్టిలో పెట్టుకుని బిజెపిలో ప్రాధాన్యత ఇస్తారంటున్నారు. ఇక మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఒకరికి ఛాన్స్ వస్తుంది. కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్, నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ధర్మపురి అరవింద్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మున్నూరు సామాజిక వర్గానికి చెందిన వారు. వీరిలో ఎవరి అర్హతలు వారికున్నాయి. దీంతో వీరిలో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి వరించనుంది. గౌడ సామాజిక వర్గం నుంచి బూర నర్సయ్య పేరు కూడా ఖచ్చితంగా పరిశీలనలో ఉంటుంది. రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి నుంచి కిషన్ రెడ్డిని తప్పిస్తే ఈ ఐదుగురు బిసి ఎంపిలలో ఒకరికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయి.

తెలంగాణలో బిసిలతో పాటు మాదిగలు కూడ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారి ఆదరణ కూడా తమకు ముఖ్యమని బిజెపి భావిస్తున్నది. అందుకే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసి, తెలంగాణ నుంచి ఒక మాదిగను కేబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నది. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగతో ప్రధాన మంత్రి నరేంద్రమోడికి ఈ మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. మంద కృష్ణను రాజ్యసభ సభ్యుడిగా చేసి కేంద్ర మంత్రిని చేసే ఛాన్స్ ఉంది. అలా కాని పక్షంలో వరంగల్ నుంచి ఆరూరి రమేష్ విజయం సాధిస్తే మాదిగ కోటా కింద కేంద్ర మంత్రిని చేసే అవకాశం ఉంది.

వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ అమలవుతుంది. వచ్చే ఎన్నికల్లో మహిళల ఆదరణ తమకే ఉంటుందని బిజెపి భావిస్తున్నది. అందుకే మహిళలకు కేంద్ర కేబినెట్లో ఎక్కువ మందికి చోటు కల్పించాలని బిజెపి నిర్ణయించినట్లు తెలిసింది. హైదరాబాద్ నుంచి మాధవిలత గెలిస్తే తప్పక మహిళా కోటా కింద కేంద్ర మంత్రి కావచ్చు అంటున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ లో కాపు నాయకత్వాన్ని బాగా ప్రోత్సహించాలని బిజెపి నిర్ణయించింది. సినీ హీరో పవన్ కల్యాణ్ ను ప్రమోట్ చేయాలని కూడా నిర్ణయించింది. అందుకే ఆంధ్రప్రదేశ్ లో మహాకూటమి గెలిచినా సరే, పవన్ కల్యాణ్ ను రాష్ట్ర మంత్రిని చేయకుండా, రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రిని చేసి ముఖ్యమంత్రితో సమానంగా చూపాలని బిజెపి భావిస్తున్నది. కాపు వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ ను కేంద్ర మంత్రిని చేస్తే దాని ప్రభావం ఎపితో పాటు తెలంగాణలో కూడా ఉంటుందని బిజెపి అంచనా వేస్తున్నది. భవిష్యత్తు రాజకీయాల్లో పవన్ క్రేజ్ ను, పవన్ సామాజిక వర్గాన్ని తమ వ్యూహాలకు అనుగుణంగా వాడుకోవాలని బిజెపి ఎత్తుగడ వేసింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా ఉన్న పురంధరేశ్వరి, అనకాపల్లి నుంచి పోటీ చేసిన సిఎం రమేశ్ కూడా మంత్రి పదవి రేసులో ఉంటారు. అయితే ఎన్టీఆర్ కూతురుగా, మాజీ కేంద్ర మంత్రిగా పురంధరేశ్వరికే ఎక్కువ అవకాశాలున్నాయంటున్నారు. రాజంపేట నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తే ఆయన పేరు కూడా కేంద్ర మంత్రి పదవి కోసం సీరియస్ గా పరిగణలోకి వస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కావడం, రెడ్డి నేత కావడం కిరణ్ కుమార్ రెడ్డి ప్లస్ పాయింట్స్. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒకరికి కేంద్ర మంత్రి పదవి వరించే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం నుంచి పోటీ చేసిన బిసి సామాజిక వర్గానికి చెందిన కింజరపు రామ్మోహన్ నాయుడు పేరును పరిశీలించే అవకాశం ఉంది.

కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించాలని భావించిన వారికి అధిష్టానం ఎన్నికల సమయంలోనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. మీరు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది. గట్టిగా ప్రయత్నించి, ఎంపిగా గెలవండి అని చెప్పినట్లు సమాచారం. కేంద్ర మంత్రిని చేద్దామనుకునే వారికి తగిన సహాయాన్ని కూడా పార్టీ తరుఫున అందించినట్లు కూడా తెలిసింది. అయితే బిజెపి నుంచి పోటీ చేసిన వారిలో ఎంత మంది గెలుస్తారు? కేంద్రంలో మళ్లీ బిజెపి ప్రభుత్వం వస్తుందా? అనే అంశాలపై కూడా కేంద్ర మంత్రులు ఎవరు అవుతారనే విషయం ఆధారపడి ఉంటుంది.

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved