Home » చంద్రబాబు రాజకీయ ప్రస్థానం భవిష్యత్ తరాలకు ఓ విశ్వవిద్యాలయం

చంద్రబాబు రాజకీయ ప్రస్థానం భవిష్యత్ తరాలకు ఓ విశ్వవిద్యాలయం

by Goldandhraadmin
0 comment
Andhra Pradesh latest news : Will Chandrababu's government continue the volunteer system brought by the previous YCP government..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనో పెను సంచలనం.. భవిష్యత్ తరాలకు ఆయనో నిఘంటువు.. వ్యూహాలు పన్నడంలో ఆయనో అపర చాణిక్యుడు.. ఈ మూడు ముక్కలు చెప్పగానే ఎవరైనా సరే ఠక్కున చెప్పే పేరు నారా చంద్రబాబు నాయుడు. ఆయన చూడని ఎత్తు లేవు..ఆయన చూడని పల్లాలూ లేవు.. ఎన్నో విజయాలు ఆయన ముంగిట మోకరిల్లినా.. అపజయాలు ఆయన్ని చుట్టుముట్టినా తొడకని..బెసకని..అలుపెరగని రాజకీయ దురందురిడిగా చంద్రబాబు రాజకీయ ప్రస్థానం భావి తరాలకు ఓ దిక్సూచీ..

రాజకీయాల్లో తొలి అడుగు:

చంద్రబాబు నాయుడు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా పలు పోరాటాలు చేశారు.. అప్పుడే రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. అప్పటి ఎమ్మెల్సీ రాజగోపాల్ నాయుడి చంద్రబాబులోని లీడర్ షిప్ క్వాలిటీని చూసి ఎంకరేజ్ చెయ్యడంతో రాజకీయాల్లో తొలి అడుగులేశారు చంద్రబాబు.. . ఎన్‌జీ రంగా అనుచరుడిగా ఉంటూ ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా ఎంట్రీ ఇచ్చారు .

ఎంట్రీతోనే సూపర్ హిట్ :

1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి చంద్రబాబు పోటీ చేశారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో ఇందిర కాంగ్రెస్ తరఫున చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. గాంధేయవాదిగా పేరున్న పట్టాభిరామ చౌదరిపై 2వేల 494 ఓట్ల మెజార్టీతో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.. తొలి ప్రయత్నంలోనే చంద్రబాబుకు 35వేల 92 ఓట్లు రాగా… పట్టాభిరామ చౌదరికి 32వేల 598 ఓట్లు రావడంతో ఆయన ఓటమి పాలయ్యారు. అలా మొదటి సారి ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు చంద్రబాబు..

తొలినాళ్లల్లోనే వరించిన మంత్రి పదవి:

అసెంబ్లీలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరు అంజయ్య కేబినేట్ లో చంద్రబాబుకు మంత్రి పదవి వరించింది. సాంకేతిక విద్య, పశు సంవర్థక, పాడి పరిశ్రమ, మైనర్‌ ఇరిగేషన్‌తో పాటు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో సినిమా వాళ్లతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి.

టీడీపీలోకి ఎంట్రీ:

సినిమాటోగ్రఫీ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్‌తోనూ సాన్నిహిత్యం ఏర్పడింది. తర్వాత ఆయనలోని దీక్షా పట్టుదలు చూసిన ఎన్టీఆర్ భవిష్యత్ లో మంచి లీడర్ గా ఎదుగే అన్ని లక్షణాలున్నాయని గ్రహించి ఆయన చిన్న కుమార్తె భువనేశ్వరితో చంద్రబాబుకు వివాహం జరిపించారు.. ఆ తర్వాత కొన్ని నెలలకు అంటే 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారు..అయితే చంద్రబాబు వెంటనే అందులో చేరిపోలేదు. కొన్నాళ్లు కాంగ్రెస్‌లోనే కొనసాగారు.. తెలుగుదేశం పార్టీ తొలిసారి పోటీ చేసినప్పుడు 1983లో జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబు పోటీ చేశారు. టీడీఈ అభ్యర్థి మేడసాని వెంకట రామనాయుడి చేతిలో ఓడిపోయారు..ఆనక చంద్రబాబు టీడీపీలో చేరారు.

తెలుగుదేశంలో తన దైన మార్క్:

తెలుగుదేశంలోకి వచ్చిన చంద్రబాబు పనితీరు కొద్ది నెలల్లోనే ఎన్టీఆర్‌ను అమితంగా ఆకట్టుకుంది…ముఖ్యంగా నాదెండ్ల భాస్కరరావు తిరుగుబావుటా ఎగురవేసిన సమయంలో బాబు వేసిన ఎత్తులూ .. పైఎత్తులు పార్టీకి మేలు చేశాయి.. సత్ఫలితాలను ఇచ్చాయి..అప్పుడు ఆయన అనుసరించిన రాజకీయ వ్యూహాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 1984లో ఎన్టీఆర్ వైద్యం కోసం అమెరికా వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కరరావు కొందరు ఎమ్మెల్యేలను కూడగట్టుకుని సీఎం అయ్యారు.. ఆ సమయంలో నాదెండ్ల క్యాంపు రాజకీయాలు చేసి.. ఎమ్మెల్యేలతో గవర్నర్‌ను కలిసి సీఎం అయ్యారు. అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజుల సమయవిచ్చారు గవర్నర్ .. అంతే.. ఆ సమయాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకుని ..చాక చక్యంతో చక్రం తిప్పి టీడీపీ ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని వెళ్లి రాష్ట్రపతిని కలిసి ఎన్టీఆర్ కు మద్దుతు ప్రకటించారు.. మెజార్టీ ఎమ్మెల్యేలను ఎన్టీఆర్ కు సపోర్ట్ గా చంద్రబాబు కూడగట్టడంతో సీన్ అంతా రివర్స్ అయ్యింది.. తనకు బలం లేదని తెల్సుకున్న నాదెండ్ల భాస్కర్ రావు బల నిరూపణకు ముందే చేతులెత్తేసి… సీఎం పదవికి రాజీనామా చేశారు.. ఈ ఘటన నుంచే బాబుకు ఎన్టీఆర్ ప్రాధాన్యత ఇవ్వటం మొదలు పెట్టారు.. 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయకుండా టీడీపీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేశారు.

1989లో టీడీపీ నుంచి తొలిసారి పోటీ:

రంగా హత్య నేపథ్యంలో జరిగిన అల్లర్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైయినా.. చంద్రబాబు కుప్పం నుంచి గెలిచి తన సత్తా చాటుకున్నారు. కాంగ్రెస్ కు ఉవ్వెత్తున గాలి వీచిన సమయంలోనూ..ఆయన చంద్రగిరి వీడినా కూడా..కుప్పంలో గెలిచి శభాష్ అనిపించుకున్నారు.. ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి వెళ్లడానికి అప్పట్లో ఎన్టీఆర్ ఏ మాత్రం ఒప్పుకోకపోవడంతో.. డీలా పడ్డ పార్టీకి అన్నీ తానై ఊపిరి పోశారు చంద్రబాబు .. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు అప్పగించారు ఎన్టీఆర్. దీంతో ఆ తర్వాత1994 లో వచ్చిన ఎన్నికల్లో టీడీపీ భారీగా సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

మరో సారి ఆగష్టు సంక్షోభం:

సంక్షోభాలను ఎదుర్కొని నిలబడటంలో చంద్రబాబు నేర్పరి. నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ తర్వాత.. వచ్చిన మరో పెద్ద సంక్షోభం ఈసారి ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి వల్ల వచ్చి పడింది. లక్ష్మీపార్వతి జోక్యం పెరుగుతోన్న సమయంలో పార్టీని వీడేందుకు రెడీ అయిన ఎమ్మెల్యేలకు నచ్చజెప్పి ..పార్టీని నిలబెట్టేందుకు చంద్రబాబు తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. ఇది ఎన్టీఆర్ పై తిరుగుబాటు కాదని, అప్పటి పరిస్థితులపై మాత్రం చంద్రబాబు స్పందించారని చాలా మంది ఎమ్మెల్యేలకు తెలుసు. తప్పని పరిస్థితుల్లో ఎంత నచ్చజెప్పినా ఎన్టీఆర్ వినని సిట్యువేషన్ లో చంద్రబాబు అవిశ్వాసం ప్రకటించి… ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పరిణామాన్ని ఉద్దేశించే వెన్నుపోటు రాజకీయం అంటూ విపక్షాలు, ఆయన వ్యతిరేకులూ ఇప్పటికీ విమర్శలు చేస్తున్నా..సామాన్య జనం మాత్రం ఇది అనివార్యమైన సంఘటనగానే తీసుకున్నారు. అందుకే 1999లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఆయనకే పట్టం గట్టారు.. 1999లో సొంతంగా ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీ మద్దతుతో 178 స్థానాలను ఆయన నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అందుకోగా.. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు..

ఆటు పోట్లు:

2003 అక్టోబర్ 1న టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే మార్గంలోని అలిపిరి ఘాట్ రోడ్డులో బాంబు దాడి జరిగింది..ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం బుల్లెట్ ప్రూఫ్‌ కావడంతో లక్కీగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రజలతోపాటు వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే బతికానని చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు . ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అధికారాన్ని కోల్పోయారు. కారణాలేవైనా 2004, 2009లలో టీడీపీ పదేళ్ల పాటు అధికారాన్ని కోల్పోయింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. అనుభవం ఉన్న నాయకుడైతేనే రాష్ట్రం అభివృద్ధి పథాన నడుస్తుందని భావించిన ప్రజలు టీడీపీకి మళ్లీ పట్టం కట్టారు..దీంతో ఎన్డీఏ కూటమితో జత కట్టిన చంద్రబాబు నవ్యాంధ్ర ప్రదేశ్ కు తొలి సీఎంగా 2014లో ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్లపాటు తనకున్న పాలనానుభవంతో అమరావతిని రాజధానిగా చేసేందుకు ఎంతో కృషి చేశారు.. అయితే 2019లో ఒక్కఛాన్స్ ఒక్కఛాన్స్ అంటూ వచ్చిన జగన్ మోహన్ రెడ్డికి ఒక్క అవకాశమిద్దామని భావించిన జనం వైసీపీకి జై కొట్టారు. 151 సీట్లిచ్చి జగన్ ను సీఎం చేశారు. ఆ ఎన్నికల్లో 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే టీడీపీ పరిమితమైంది! అధినేత చంద్రబాబు వయోభారాన్ని ఎత్తి చూపుతూ ఇక టీడీపీ దుకాణ్ బంద్ అంటూ వైఎస్సార్సీపీ దెప్పిపొడిచింది. ఈ కామెంట్స్ కు ఊతమిచ్చేలా.. తెలుగుదేశం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరాం సైకిల్‌ దిగి వైఎస్సార్సీపీ పంచన చేరారు. అటు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించిన ఎంపీలు గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్ కమలం గూటికి చేరిపోయారు. ఇక తెలుగుదేశం ఏపీలో ఖాళీ అయ్యిందంటూ వైఎస్సార్సీపీ లోలోపల తెగ సంబరపడింది. కక్షపూరిత రాజకీయాలకు తెర తీసింది. స్కామే లేని స్కిల్ కేసులో దోషిని చేసే ప్రయత్నం చేసి చంద్రబాబును 53 రోజుల పాటు జైల్లో మగ్గేలా చేశాడు జగన్ రెడ్డి.

తొణకలేదు..బెణక లేదు.. బౌన్స్ బ్యాక్:

బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబు కుంగిపోలేదు సరికదా తన మెదుడుకు మరింత పదును పెట్టారు. పవన్ కళ్యాణ్ తో కల్సి.. మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి చేరి.. జగన్ కోలుకోలేని దెబ్బ తీశారు.. ఫలితంగా ఇటు ఆంధ్రాలో తిరుగులేని మెజార్టీ సాధించడమే కాదు.. అటు కేంద్రంలోనూ చక్రం తిప్పే స్థాయికి చేరారు చంద్రబాబు.. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్లీ ప్రయత్నించక పోవడమే ఓటమి అనుకుని కదన రంగంలోకి దిగి హిస్టారికల్ విక్టరీని సాధించారు. పడిన ప్రతిసారీ ఉవ్వెత్తున లేవడం ఆయనకు అలవాటు.. భయం.. బెరకు అనేవి ఆయన దరి చేరవు.. అందుకే మళ్లీ ఏపీ సీఎంగా నాలుగో సారి బాధ్యతలు చేపట్టబోతున్నారు చంద్రబాబు. ఆయన రాజకీయ ప్రయాణం కొత్తతరం రాజకీయ నాయకులకు ఓ మార్గదర్శకం..అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లే కాదు భారతీయులంతా ముక్తకంఠంతో 74 ఏళ్ల బాబు రాజకీయ చతురతకు ఫిదా అవుతూ.. శభాష్ చంద్రబాబు బాబూ.. కీప్ ఇట్ అప్.. అంటూ కొనియాడుతున్నారు…

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved