Home » Prashanth Kishore Vs Yogendra Yadav : ఎవరిది నిజం..?

Prashanth Kishore Vs Yogendra Yadav : ఎవరిది నిజం..?

by PoliticalNewsDesk
0 comment

 

వాళ్లిద్దరూ తలపండిన రాజకీయ విశ్లేషకులు. అనేక సంవత్సరాలుగా ఎన్నికల వ్యూహకర్తలుగా పని చేస్తున్నారు. ప్రజల నాడిని పట్టుకోవడంలో ఎవరికి వారే సాటి. అయితే ఈ సారి పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై ఇద్దరూ చెరో మాట చెబుతున్నారు. నా మాటే నిజమవుతుందని ఎవరికి వారు ఢంకా బజాయించి చెబుతున్నారు. రాష్ట్రాల వారీగా ఎవరెన్ని సీట్లు గెలుచుకుంటారో కూడా లెక్కకట్టి చెబుతున్నారు. ఎదుటి వారి వాదనను గణాంకాలతో కొట్టి పారేస్తున్నారు. దాదాపు 2019 ఫలితాలే రిపీట్ అవుతాయని ఒకరు ఖచ్చితంగా చెబుతుండగా, అంత సీన్ లేదని చాలా మార్పు వస్తుందని మరొకరు స్పష్టం చేస్తున్నారు.

Farmers' Protest: No Covid Rules In Bihar Election, But They Apply To ...

ప్రశాంత్ కిషోర్. భారత రాజకీయాలను గమనిస్తున్న వారికి సుపరిచితమైన ఎన్నికల వ్యూహకర్త. ఐ ప్యాక్ అనే సంస్థ ద్వారా 2014లో మోడిని ప్రధాని చేసేందుకు పనిచేసిన వ్యక్తి. తర్వాత మోడికి, బిజెపికి దూరమై అనేక ప్రాంతీయ పార్టీలకు పనిచేసిన ఎలక్షన్ స్ట్రాటజిస్టు, పొలిటికల్ అనలిస్టు. తెలుగు రాష్ట్రాల్లో కూడా జగన్ కు, కేసీఆర్ కు పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ తో సరితూగగల మరో రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్. సామాజిక కార్యకర్త. కొంతకాలం ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసి, తర్వతా స్వరాజ్ ఇండియా పేరుతో సొంత పార్టీ నడుపుతున్న నాయకుడు. భారత రాజకీయాలపై సరైన అంచనా కలిగిన వ్యక్తిగా పేరుంది. 2024 పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై ఈ ఇద్దరూ ఇప్పుడు పరస్పర భిన్నమైన అంచనాలు వేస్తున్నారు. ప్రధానంగా బిజెపికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపైనే వీరు రాష్ట్రాల వారీగా వేసిన అంచనాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా వీరిద్దరి అంచనాల మధ్య చర్చోపచర్చలు నడుస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరు చెప్పింది నిజం కాబోతుంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

2019 ఎన్నికల్లో బిజెపి సొంతంగా 303 సీట్లు గెలుచుకుంది. బిజెపి నాయకత్వంలోని ఎన్.డి.ఏ. కూటమి 353 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో కూడ దాదాపు ఇవే ఫలితాలు వస్తాయని ప్రశాంత్ కిషోర్ అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో బలం కాస్త తగ్గి, కొత్త రాష్ట్రాల్లో బలం పెరుగుతుందని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. ఉత్తర ప్రదేశ్, బీహార్, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ గఢ్, ఉత్తరా ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కలిసి 279 సీట్లుంటే, 2019 ఎన్నికల్లో బిజెపి ఏకంగా 215 సీట్లు గెలుచుకోగలిగింది. గుజరాత్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే వందకు వంద సీట్లు గెలుచుకుంది. ఈసారి ఇంత పెద్ద మొత్తంలో కాకపోయినా, ఇండియా కూటమి కన్నా ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ప్రశాంత్ కిషోర్ అంచనా వేస్తున్నారు. అయితే దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బిజెపికి అదనంగా కనీసం 20-25 సీట్లు వస్తాయని ఆయన చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తూర్పు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, అస్సాం రాష్ట్రాల్లో మొత్తం 208 సీట్లున్నాయి. వీటిలో గత ఎన్నికల్లో బిజెపి 64 సీట్లు గెలుచుకుంది. ప్రశాంత్ కిషోర్ అంచనా ప్రకారం ఇక్కడ 20-25 సీట్లు అదనంగా వస్తే, దక్షిణ, తూర్పు రాష్ర్ట్రాల్లో కలిపి బిజెపికి 85 సీట్లు వచ్చినట్లు అవుతుంది. ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో 180 నుంచి 190 సీట్లు, దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లో 80 నుంచి 90 సీట్లు మొత్తం కలిపితే 270 నుంచి 280 సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. పంజాబ్, కాశ్మీర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి కనీసం మరో 20 సీట్లు వస్తాయని దీంతో బిజెపి 300 సీట్లకు చేరుకుంటుందని ప్రశాంత్ కిషోర్ అంచనా. ఎన్.డి.ఏ. భాగస్వామ పక్షాలైన తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్, ఏకనాథ్ షిండే శివసేన, లోక్ జనశక్తి లాంటి పార్టీలు కనీసం మరో 50 సీట్లు గెలుకుంటాయని, దీంతో ఎన్డీఏ కూటమి బలం 350కు చేరుకుంటుందని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. అయితే బిజెపి కోరుకుంటున్నట్లు ఎన్డీఏ కూటమికి 400 సీట్లు, బిజెపికి 370 సీట్లు రావడం మాత్రం అసాధ్యమని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. బిజెపికి 370 సీట్లు రావన్నది ఎంత నిజమో, 270 సీట్ల కన్నా తగ్గవు అనేది కూడా అంతే నిజమని ఆయన బల్లగుద్ధి మరీ చెబుతున్నారు.

ఇక మరో రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ మాత్రం ప్రశాంత్ కిషోర్ లెక్కలను తప్పు పడుతున్నాడు. దేశ వ్యాప్తంగా బిజెపి హవా పడిపోయిందని, చాలా రాష్ట్రాల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని యోగేంద్ర యాదవ్ చెబుతున్నారు. ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో 279 సీట్లకు గాను బిజెపి 180 సీట్లకు మించి గెలవదని, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో కూడా బిజెపి బలం 40 దాటదని చెబుతున్నారు. మొత్తంగా బిజెపికి 240 సీట్లు మించి రావని, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు మరో 20 నుంచి 30 సీట్లు వస్తాయని ఆయన లెక్క కడుతున్నారు. 272 మ్యాజిక్ ఫిగర్ కు మాత్రం ఎన్డీయే కూటమి చేరుకోదని ఖచ్చితంగా చెబుతున్నారు.

బిజెపి సొంతంగానే 300 సీట్లు సాధిస్తుందని ప్రశాంత్ కిషోర్ చెబుతుండగా, 240 సీట్లు దాటవని యోగేంద్ర చెబుతున్నారు. ఎన్డీయే కూటమి 272 సీట్లు సాధించలేదని యోగేంద్రయాదవ్ చెబుతుండగా, బిజెపి ఒక్క పార్టీనే 270 సీట్లకు పైగా తెచ్చుకుంటుందని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి బలం దాదాపు గత ఎన్నికల మాదిరిగానే ఉంటుందని ప్రశాంత్ కిషోర్ చెబుతుండగా, కాంగ్రెస్ సొంతంగా 100 సీట్ల వరకు, ఇండియా కూటమి 235 సీట్ల వరకు గెలుస్తుందని యోగేంద్ర యాదవ్ అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే తటస్థంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్, వైఎస్ఆర్సిపి, అకాలీదళ్ లాంటి పార్టీల మద్దతు కీలకం అవుతుంది.

ఇద్దరు పేరు మోసిన రాజకీయ విశ్లేషకులు, దేశ రాజకీయ పరిణామాలపై సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తులు వేర్వేరు అంచనాలు వేయడంతో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఎవరి అంచనాలు నిజమవుతాయయో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే అనేక విషయాల్లో ఇద్దరూ వేర్వేరు అభిప్రాయాలు చెప్పినప్పటికీ, ఎన్డీఏకు 400 సీట్లు, బిజెపికి 370 సీట్లు రావనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతో ఉన్నారు.

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved